మూడోవంతు బడుల్లో గురువుల కొరత:
* సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లేని పాఠశాలలు అత్యధికం
* నాణ్యత, ఉత్తీర్ణతలపై తీవ్ర ప్రభావం
:: సర్కారు ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో విద్యానాణ్యత నానాటికీ పడిపోతోంది. ఆ ప్రభావం చివరకు పదో తరగతి ఫలితాలపైనా పడుతోంది. సగటున 35 శాతం బడుల్లో గురువుల్లేకుండానే విద్యా బోధన సాగుతుండటం గమనార్హం. అత్యధికంగా 44.75 శాతం పాఠశాలల్లో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 4,583 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 6 నుంచి 10వ తరగతి వరకూ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులున్నారు. అందులో 80 శాతం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. పదోతరగతిలో ఉత్తమ గ్రేడ్లు సాధించాలన్నా, ఇంటర్మీడియట్లో రాణించి, ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నా హైస్కూల్ విద్య పటిష్ఠంగా ఉండటం అత్యంత అవసరం. తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు ఉన్నత బడుల్లో సగటున 35 శాతం బడుల్లో గణితం, సామాన్య (భౌతిక, జీవ) శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భాష (తెలుగు, హిందీ, ఆంగ్లం) సబ్జెక్టుల ఉపాధ్యాయులు లేరు. ఫలితంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులే గణితం చెబుతున్నారు. గణితం చెప్పేవారు సామాన్య, సాంఘిక శాస్త్రాలు బోధించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులపైనా పనిభారం పెరుగుతోంది. విద్యార్థుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆయా అంశాలను పిల్లలు లోతుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరకు పదో తరగతిలో గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఎక్కువ మంది తప్పుతున్నారు. గత మార్చి 10వ తరగతి పరీక్షల్లో లక్ష మంది తప్పగా వారిలో 50 వేల మంది గణితంలోనే ఉన్నారు. మిగతా వారిలో అత్యధికం ఆంగ్లం, సైన్స్‌లోనే ఉన్నారు. పదో తరగతిలో 85 శాతం మంది ఉత్తీర్ణులైనా 10 గ్రేడ్ పాయింట్‌తో పాసైన వారు కేవలం వందల మందే ఉండటం గమనార్హం.
ఉపాధ్యాయుల్లో ఆందోళన
సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఒక వైపు పీడిస్తుండగా మరోవైపు పాఠశాల విద్యాశాఖ మాత్రం జిల్లా సగటు కంటే పదో తరగతిలో పాఠశాల ఉత్తీర్ణత తగ్గితే మెమోలు జారీ చేస్తామని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా ఉత్తీర్ణత శాతం పెరగాలని ఆదేశాలివ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఉత్తర్వులు వారిలో ఆందోళన రేపుతున్నాయి.
సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేని బడులు
సబ్జెక్టు - శాతం
గణితం - 35.53
సామాన్య శాస్త్రం - 28.50
సాంఘిక శాస్త్రం - 44.75
భాష - 29.45
సగటు - 34.55
Source : eenadu news paper 15/11/2016
LATEST NEWS
Search This Blog
deoasfad1
Sunday, 13 November 2016
త్వరలో హేతు బధ్ది కరణ వుండబోతోందా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment